News and Entertainment

మహత్తర చిత్ర రాజం – మాయాబజార్



వందేళ్ళ సినిమా చరిత్రలో, సుమారు ఎనభై సంవత్సరాలు పైబడిన తెలుగు 
చలన చిత్ర చరిత్రలో – అన్నింటికన్నా మొదటిగా నిలబడే మహత్తర చిత్ర రాజం – మాయాబజార్

తెలుగు వారిలో“మాయాబజార్” సినిమా ను కనీసం ఒక్కసారైనా చూడనివాడు గాని, చూసి హర్షించనివాడు గాని ఉండబోడంటే అతిశయోక్తి కాదు.

ఈ కళాఖండం విడుదలయి ఇప్పటికి 57 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శించిన ప్రతీసారీ చూసే అభిమానులు కోకొల్లలు. ఎన్నితరాలు మారినా, చిన్నవయసు బాలలనుంచి, వృధ్ధులవరకూ, ఏ వయసు వాళ్ళైనా ఈ సినిమాను పదే పదే చూస్తూనే ఉంటారు. చూసి ఆనందిస్తూనే ఉంటారు.

అంతమంది హృదయాలను చూరగొన్న ఆ సినిమా కథ, మహాభారతం ఆధారంగా అల్లబడిన “శశిరేఖా పరిణయం” అనే అంశానికి సంబంధించిందైనప్పటికీ, ఈ కథ మూల కథలో లేదంటే అశ్చర్యకరమైన విషయమే కదా!

మూలకథైన “మహాభారతం” ప్రకారం అభిమన్యుని భార్య “ఉత్తర” కానీ, ఎక్కడా శశిరేఖ ప్రస్తావనన్నదే లేదు. అటువంటిది, ఒక పుక్కిటి పురాణం వంటి అంశం తీసుకుని, ఇంత రసవత్తరంగా కథను మలిచారంటే ఆ గొప్పతనమంతా రచయిత శ్రీ పింగళి నాగేంద్ర రావు గారిది.