News and Entertainment

జీవన కాలమ్: కనిమొళి అభినవ సీతా?


జీవన కాలమ్
నాకు కాంగ్రెస్ మీద ఈ మధ్య అపారమైన గౌరవ ప్రపత్తులు పెరిగిపోతున్నాయి. కారణం మనలాంటి పామర జనానికి అర్థంకాని ఎన్నో చారిత్రక సత్యాలను కాంగ్రెస్ నాయకులు మనకు వక్కాణిస్తున్నారు. ఉదాహరణలు బోలెడు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ గారు ఆ మధ్య ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ను మహాత్మాగాంధీతో పోల్చారు. అలాగే మరో గొప్ప నాయకులు శశి తరూర్‌గారు నిన్నకాక మొన్న నోరు విప్పిన కన్హయ్యను స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్‌తో పోల్చారు. ఆ మహానుభావుల పేర్లు మాత్రమే విన్న, చరిత్ర అంతగా అవగాహన లేని నేటి యువతరానికి ఈ నాయకుల ఉవాచలు కనువిప్పు కాగలవని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ఉదాహరణలను గమనిస్తే నేటి యువతరం ఇంక మహాత్మాగాంధీనీ, భగత్‌సింగ్‌నీ మరిచిపోవచ్చు.

ఇక పురాణాలలో ఆరితేరిన మరో మహానా యకుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. వారి పేరు దిగ్వి జయ్‌సింగ్. భారతీయ జనతా పార్టీ అద్వానీగారు తమకు భీష్మపితామహుడివంటి వారన్నప్పుడు ‘‘మరి ఆ పార్టీలో దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, శకుని వంటి పాత్రలెవర’’ని వాపోయారు. మరో నాయకులు - రామాయణంలో దిట్ట - షకీల్ అహ మ్మద్‌గారు బీజేపీ ఈసారి కొడుక్కి బదులు తండ్రిని అడవులకు పంపింది- అని వాక్రుచ్చారు. ఇవన్నీ ఆయా నాయకుల పౌరాణిక, చారిత్రక మేధా సంప త్తికి అపూర్వ తార్కాణాలు. అలనాడు బంగ్లాదేశ్ పోరాటం తర్వాత ఇందిరా గాంధీని కాంగ్రెస్ నాయకులు దుర్గాదేవిగా అభివర్ణిం చారు. మొన్నటికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శంకరరావు సోనియా గాంధీని దేవతని చేసి దేవాలయాన్ని నిర్మించారు. చరిత్ర, పురాణాలు కాంగ్రెస్‌కి కొంగుబంగారం.