News and Entertainment

సినిమా రివ్యూ: జెంటిల్‌మన్‌


రివ్యూ: జెంటిల్‌మన్‌
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: శ్రీదేవి మూవీస్‌
తారాగణం: నాని, నివేదా థామస్‌, సురభి, శ్రీనివాస్‌ అవసరాల, శ్రీముఖి, ఆనంద్‌, వెన్నెల కిషోర్‌, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు
కథ: ఆర్‌. డేవిడ్‌నాధన్‌
సంగీతం: మణిశర్మ
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
కథా విస్తరణ, కథనం, మాటలు, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: జూన్‌ 17, 2016

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, ఇప్పుడు 'జెంటిల్‌మన్‌'... కథల ఎంపికలో నాని మిగతా హీరోల కంటే పరిణితి చూపిస్తున్నాడు. తనకి ఫలానా అంటూ ఇమేజ్‌ ఏమీ లేకపోవడం అతని ప్లస్‌ అనుకోవచ్చు. అయినప్పటికీ కథ విని దాంట్లో పొటెన్షియల్‌ ఉందని గ్రహించడం అంత తేలికేం కాదు. చాలా మంది హీరోలు తాము విన్న కథల్ని తెర మీద ఎలా ఉంటాయనేది ఊహించుకోలేక మంచి కథల్ని వదిలేసుకుని, రొటీన్‌ కథలతో సేఫ్‌ గేమ్‌ ఆడడానికి చూస్తారు. నాని అలాక్కాదు. ప్రతి సినిమాకీ వేరియేషన్‌ చూపించడానికి ట్రై చేస్తాడు.

'ఎవడే సుబ్రమణ్యం'లాంటి ఫిలసాఫికల్‌ టచ్‌ ఉన్న కథకి ఓకే చెప్పడంలోనే అతని అభిరుచి ఏంటనేది తెలుస్తుంది. ఇలా కథలో వైవిధ్యం కోసం చూస్తున్నాడు కాబట్టే ఎన్ని హిట్‌ సినిమాలొచ్చినా కానీ నానికి ఇంతవరకు ఎలాంటి ఇమేజ్‌ ముద్ర పడిపోలేదు. ఇక జెంటిల్‌మన్‌ విషయానికి వస్తే, ఇది కూడా నటుడిగా తన సామర్ధ్యాన్ని పరీక్షించే చిత్రమే. అయితే ఎంత కష్టతరమైన పాత్ర అయినా అందులోకి సునాయాసంగా ఇమిడిపోవడంలోనే అతని ప్రతిభ దాగుంది. ఇతను ఒకడా, ఇద్దరా? ఒకడే అయితే విలనా, హీరోనా? అంటూ కన్‌ఫ్యూజ్‌ చేసే జెంటిల్‌మన్‌లో ఆసక్తికరమైన కథా వస్తువు ఉంది. తెర మీది పాత్రల మధ్య సంఘర్షణ కంటే, పాత్రలు, ప్రేక్షకుల నడుమ సాగే సంఘర్షణే 'జెంటిల్‌మన్‌'ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ట్విస్ట్‌ ఏంటనేది ఊహించగలిగినా కానీ కొన్ని ప్రశ్నలైతే చివరి వరకు వెంటాడుతుంటాయి. సమాధానం కోసం ఎదురు చూసేలా చేస్తాయి. ప్రేక్షకుడిని గెస్సింగ్‌ మోడ్‌లో ఉంచగలగడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి సక్సెస్‌ అయ్యాడు. ఏం జరిగి ఉంటుంది అంటూ ఎప్పటికప్పుడు మన మదిలో కూడా రకరకాల సినారియోస్‌ నడుస్తూ ఉంటాయి. చూసే వాళ్లు ఆసక్తి కోల్పోకుండా, ఆన్సర్స్‌ కోసం  చివరి వరకు చూసేట్టు చేయడంలోనే జెంటిల్‌మన్‌ సక్సెస్‌ అయింది. ఏం జరిగిందనే దగ్గరకి వెళ్లే ముందు, ఏం జరిగిందో చెప్పే ముందు మధ్యలో జరిగేదంతా ఆసక్తికరంగా నడుస్తుంది. అందుకే 'అంతకుముందు', 'ఆ తరువాత' అనుకున్నంత ప్రభావవంతంగా లేకపోయినప్పటికీ జెంటిల్‌మన్‌ ఓవరాల్‌గా పాస్‌ అయిపోతుంది.

ప్లాట్‌ ఏంటనేది తెలుసుకోవడానికి ఇంటర్వెల్‌ వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. దానికి ముందు చెప్పే ప్రేమకథల్లో సురభితో నాని కొడైకెనాల్‌ వెళ్లే సీన్స్‌ బాగా విసిగిస్తాయి. అయితే ప్లాట్‌ ఓపెన్‌ చేయకపోయినా కానీ ఇద్దరు హీరోయిన్ల కథలోను హీరో ఒకడే కావడం వల్ల తెలీకుండానే అండర్‌కరెంట్‌గా ఒక అరెస్టింగ్‌ పాయింట్‌ అలర్ట్‌గా ఉంచుతుంది. ఇంటర్వెల్‌కి కథ రసకందాయంలో పడుతుంది. అటుపై హీరో క్యారెక్టర్‌ హీరోనా, విలనా అనే అనుమానం, దానికి తోడు హీరోయిన్‌ డిటెక్టివ్‌ అవతారమెత్తడం, కొన్ని సాత్విక పాత్రల తాలూకు నెగెటివ్‌ షేడ్స్‌ కనిపించడం.. ఇలాంటివన్నీ బిగి సడలకుండా కథని పరుగులు పెట్టిస్తుంటాయి. కామెడీకి స్కోప్‌ లేని కథలోకి దర్శకుడు ఇంద్రగంటి తెలివిగా ఒక కామెడీ పాత్రని (వెన్నెల కిషోర్‌) ఇంట్రడ్యూస్‌ చేసి, విసుగు రాకుండా చూసుకున్నాడు.


అయితే ట్విస్ట్‌లు రివీల్‌ అయ్యే దగ్గర కాస్త జాగ్రత్త వహించాల్సింది. మరీ ఫ్లాట్‌గా ఎండ్‌ అయిపోవడం ఒకింత వెలితిగా అనిపిస్తుంది. కథని ముగించడానికి సినిమాటిక్‌ లిబర్టీ కూడా బాగానే తీసుకున్నారు. రాంగ్‌ నోట్స్‌ ఉన్నప్పటికీ కొన్ని రైట్‌ డెసిషన్స్‌ తీసుకోవడంతో జెంటిల్‌మన్‌లో పాజిటివ్‌లే డామినేట్‌ చేస్తాయి. ఈ కథకి నాయకుడిగా నానిని ఎంచుకోవడంలో దర్శకుడు సగం సక్సెస్‌ అయిపోయాడు. ఫస్ట్‌ హాఫ్‌లో ఏమీ లేని దగ్గర కూడా తన టైమింగ్‌తో నాని నవ్వించాడు. క్లయిమాక్స్‌ ఇంకాస్త పకడ్బందీగా ఉన్నట్టయితే ఓవరాల్‌ ఇంపాక్ట్‌లో చాలా తేడా వచ్చేదనడంలో, తద్వారా జెంటిల్‌మన్‌ రేంజ్‌ పెరిగుండేదనడంలో సందేహం లేదు.

'చలిగాలి చూద్దూ' పాటతో అప్పటి మెలోడీ బ్రహ్మని ఇంకోసారి గుర్తు చేసిన మణిశర్మ, నేపథ్య సంగీతంతో ఈ చిత్రాన్ని ఇంకో మెట్టెక్కించాడు. జెంటిల్‌మన్‌ థీమ్‌ మ్యూజిక్‌ అయితే థియేటర్‌ నుంచి వచ్చిన చాలా సేపటి వరకు మైండ్‌లో ప్లే అవుతూనే ఉంటుంది. డైలాగ్‌ రైటర్‌గా ఇంద్రగంటి తన చమక్కులు చూపించాడు. అడపాదడపా నవ్వించే డైలాగులు వచ్చి పోతూ ఉండడం సినిమాకి భలేగా కలిసొచ్చింది. కెమెరా వర్క్‌ కూడా ఆకట్టుకుంటుంది. తెరపై ఆర్టిస్టుల నుంచి, తెర వెనుక టెక్నీషియన్ల నుంచి ఫుల్‌ సపోర్ట్‌ ఉండడంతో జెంటిల్‌మన్‌ పని ఈజీ అయింది.

అయితే మాస్‌ మసాలాలు, లేదంటే ఫ్యామిలీ డ్రామాలు మినహా వెరైటీ కరవైపోతున్న టైమ్‌లో 'జెంటిల్‌మన్‌' రిఫ్రెషింగ్‌ ఛేంజ్‌ అనిపిస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మిస్‌ కాకూడని సినిమా ఇది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ పరంగా వచ్చిన సమస్యల వలనో ఏమో, 'నాని జెంటిలమన్‌' అని టైటిల్‌ రిజిష్టర్‌ చేసి, అదే టైటిల్‌తో సెన్సార్‌ కూడా చేసారు. నిజానికి దీనికి 'నానీస్‌ జెంటిల్‌మన్‌' అనే టైటిల్‌ సరిగ్గా సరిపోయేది. అంతగా ఈ సినిమాకి తను ప్లస్సయ్యాడు మరి.
loading...