News and Entertainment

బర్త్‌డే స్పెషల్‌: నటనకు రాజ'కోటా'


ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం: ''అది కల.. నిద్రలో కనేది. ఇది కళ నిద్రలేపేది. కళంటే బతుకునిచ్చేదే అనుకోకు.. బతుకునేర్పేది కూడా'' ఇది 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రంలో కోటా శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్‌. హాస్యం, వ్యంగం, విలనిజం ఆయనకు లొంగనిదంటూ లేదు. నాన్న, బాబాయ్‌, తాతయ్య ఆయన చేయని పాత్ర లేదు. నిజమే ఆయనలోని ఆ 'కళ' మనకు చిరకాలం గుర్తుండిపోయే నటుడిని ఇచ్చింది. ఆయనే 'ప్రాణం ఖరీదు' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కోటా శ్రీనివాసరావు. 

అప్పుడు మొదలైన ఆయన సినీ ప్రయాణం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ.. ప్రేక్షకుల విశేష మన్ననలు పొందుతూనే ఉంది. ఆయనకున్న కష్టపడేతత్వమే ఎనిమిది నంది అవార్డులు, ఒక సైమా అవార్డు అందుకునేలా చేసింది. అంతేకాదు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' ఇచ్చి సత్కరించింది. ఆదివారం కోటా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ..

బాల్యం నుంచే..

కోటా శ్రీనివాసరావు కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి వైద్యుడు. చిన్నతనం నుంచే కోటా నాటకాల ప్రదర్శనలో హుషారుగా పాల్గొనేవారు. ఫస్ట్‌క్లాస్‌కు రెండు మార్కులు తగ్గడంతో డాక్టర్‌ చదవలేకపోయారు. అనంతరం స్టేట్‌ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ నాటకాల్లో పాల్గొనేవారు. అలా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'సినిమాల్లో నటుడిగా అంగీకరిస్తారా? లేదా అనుమానంతోనే చాలా రోజులు నాటకాలతోనే సరిపెట్టుకునే వాడిని' అంటూ చెప్పుకొచ్చేవారు. భాషా భేదం లేని అతికొద్దిమంది నటుల్లో కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. ప్రతినాయకుడు, హాస్యనటుడు, సహాయనటుడు ఇలా ఒకటేమిటి అన్నీ రకాల పాత్రల్లో అలరించే కోటా నిజ జీవితంలో కూడా చుట్టూ ఉన్న నలుగురినీ నవ్విస్తుంటారాయన. ముక్కుసూటిగా మాట్లాడమే ఆయనకు వచ్చింది.. తెలిసింది.. కూడా..!


వారి కాంబినేషన్లు అదుర్స్‌

కోటా శ్రీనివాసరావు ఒకవైపు విలన్‌గా నటిస్తూనే అనేక చిత్రాల్లో తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. ముఖ్యంగా బాబూమోహన్‌-బ్రహ్మానందం -అలీలతో కోటా కలిశారంటే నవ్వుల పువ్వులు పూయాల్సిందే. వారు నటించిన ఆ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేవి. రచయితలు కూడా వారి కాంబినేషన్‌ కుదిరేలా రాసేవారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అహనా పెళ్లంట' చిత్రంలో పిసినారిగా కోటా పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్రం చూస్తున్నంత సేపు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. 

బహుశా.. ఆ పాత్ర ఆయనకు తప్ప మరెవరికీ సాధ్యమయ్యేది కాదేమో. 'కోడిని తాడుతో దూలానికి వేలాడదీసి దాన్ని ఆస్వాదిస్తూ ఉత్త అన్నం తినడం' ఎప్పుడు తలచుకున్నా గిలిగింతలు పెడుతుంది. ఇక 'మామగారు' చిత్రంలో కోటా-బాబూమోహన్‌ల కాంబినేషన్‌ నభూతో నభవిష్యత్‌ అనడంలో అతి శయోక్తిలేదు. ఇలాంటి కాంబినేషన్లు చూస్తే ఏ ప్రేక్షకుడైనా ఫిదా అవకుండా ఎలా ఉండగలడు.

విలనిజానికి కొత్త అర్థం

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతినాయకుడిగా చాలామంది నటించి ఉంటారు. ఇక ముందూ నటిస్తారు. కానీ కోటా శ్రీనివాసరావులా విలనిజాన్ని పండించగల నటులు చాలా అరుదు. 'ప్రతిఘటన' చిత్రంలో ఆయన పోషించిన పాత్రతో ఇక నటుడిగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విలన్‌గా ఆయన పోషించిన ప్రతీ పాత్రకు కొత్త అర్థం చెప్పారు. గాయం, గణేష్‌, చిన్నా చిత్రాలకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు.

'ఈ ఫోనెవడు కనిపెట్టాడ్రా బాబూ..' అంటూ చేతులు రెండూ మెడపై పెట్టుకోని ఓ ఫోజు పెట్టినప్పుడు, 'ట్వంటీ ఇయర్స్‌ బ్యాక్‌ సేమ్‌ కార్డ్‌.. బట్స్‌ నేమ్స్‌ ఆర్‌ డిఫరెంట్‌' అంటూ పెళ్లికార్డు పట్టుకొచ్చిన వాడ్ని కంగారు పెడుతున్నప్పుడు కోటాని చూడాలి. పాత్రని బట్టి తన స్వరూపాన్ని మార్చుకోగలరాయన అనే అంచనాకి వచ్చేస్తాం. కోటా శ్రీనివాసరావు దాదాపు 232 తెలుగు, 29 తమిళ, 7 హిందీ చిత్రాల్లో నటించారు. ఇటీవల జాదూగాడు, లయన్‌, సన్నాఫ్‌ సత్యమూర్తితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కెరీర్‌ పరంగా ఆయన ఇంత సాధించినప్పటికీ దీనికి పూర్తి కారణం తాను కాందంటారు ఆయన.

'నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చా. ఇక్కడ నిర్మాతలు, దర్శకులు అందించిన ప్రోత్సాహంతో నిలబడ్డాను. నా విజయాల వెనుక, అందుకొనే పురస్కారాల వెనుక సినీ పరిశ్రమలోకి అందరి కృషి ఉంది. ఇన్నేళ్లుగా సినీ రంగానికి నేను చేసిన సేవకు, నా నటనకు గుర్తింపుగా ప్రభుత్వం పురస్కారం అందించిందని భావిస్తాను. నేనెప్పుడూ బాధ్యతతోనే వ్యవహరించా. ఇక ముందు మరింత బాధ్యతతో పనిచేస్తా. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా' అంటుంటారు మన కోటా శ్రీనివాసరావు. అలాంటి నటుడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.
వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    
source: google

loading...