News and Entertainment

కరెంట్ బిల్లు అధికంగా వస్తోందా?.... ఇలా చేసి చూడండి

వినియోగంలో మార్పు లేదు. కానీ, నెల తిరిగేసరికి విద్యుత్ బిల్లు భారీగా పెరిగిపోతోంది...? నెల క్రితం వచ్చిన బిల్లు కంటే ప్రస్తుతం వచ్చిన బిల్లు ఎక్కువగా ఉంది...? ఏడాది క్రితంతో పోలిస్తే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉపకరణాలు ఏవీ పెరగలేదు. కానీ బిల్లు ఎందుకంత ఎక్కువగా వచ్చింది...? అయితే వీటిని ఓ సారి పరిశీలించాల్సిందే... 
తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లు, అంతకు ముందు నెల బిల్లు... ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన బిల్లును ఓసారి బయటకు తీయండి. తాజా బిల్లులో ఎన్ని యూనిట్లు ఉన్నదీ పరిశీలించాలి. అంతకుముందు నెలల్లోనూ అన్నే యూనిట్ల వినియోగం ఉండి బిల్లు అమౌంట్ పెరిగిందంటే విద్యుత్ చార్జీలు పెరిగాయేమో చూసుకోవాలి. విద్యుత్ వినియోగ టారిఫ్ ను పెంచి ఉంటే కొత్త చార్జీల ప్రకారం లెక్కిస్తే తెలిసిపోతుంది. విద్యుత్ చార్జీలు పెరగకపోయినా బిల్లు మొత్తం పెరగడానికి సర్ చార్జీ, ఇతర చార్జీలు బిల్లులో వచ్చి చేరాయేమో పరిశీలించాలి. 
స్నేహితుల ఇళ్లల్లో వినియోగం... 
స్నేహితులు ఎంతో మంది ఉంటారు. మీ ఇంట్లో ఏఏ విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో ఓ సారి నోట్ చేసుకోండి. ఇప్పుడు అచ్చం అన్నే ఉపకరణాలు ఉన్న స్నేహితుల గురించి విచారించి... వారికి ఎంత బిల్లు వస్తుందో అడిగి తెలుసుకుంటే... సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది. 
మీటర్ చెకింగ్
తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లులో వినియోగ యూనిట్లు, అంతకుముందు నెలల్లో ఉన్న వినియోగం కంటే పెరిగి ఉంటే... బిల్లు కాల వ్యవధిలో ఇంట్లో ఏవైనా వేడుకలు జరిగాయా, బంధువులు కొన్ని రోజులు ఇంట్లో ఉండి వెళ్లారా, వేసవి అయితే ఏసీ వాడకం పెరిగిందా ఇలాంటి అంశాలను ఓ సారి చెక్ చేసుకోవాలి. అయినా, మీ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎప్పటిలానే ఉంటే... మీటర్ రీడింగ్ నమోదులో పొరపాటు జరిగిందా లేక సమస్య మీటర్ లో ఉందేమో పరిశీలించి విషయాన్ని రూఢీ చేసుకోవాల్సి ఉంటుంది.
మీటర్ రీడింగ్ సరిగానే ఉంటే...?
ఒకవేళ మీటర్ రీడింగ్ సరిగానే ఉందనుకుంటే... విద్యుత్ సరఫరా పరంగా ఎక్కడైన లీకేజీలు ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందు కోసం ముందుగా మెయిన్ ఆఫ్ చేయాలి. అప్పుడు కూడా మీటర్ తిరుగుతోందా...? అన్నది చెక్ చేయాలి. ఒకవేళ డిజిటల్ నంబర్ చూపించే మీటర్ అయితే...
మెయిన్ ఆఫ్ చేసి ఉంచి రీడింగ్ నమోదు చేసి.... ఓ గంట రెండు గంటల తర్వాత తిరిగి రీడింగ్ చూడాలి. రీడింగ్ లో మార్పు ఉందా? గమనించాలి. మెయిన్ ఆఫ్ చేసి ఉంచినా మీటర్ రీడింగ్ పెరుగుతూనే ఉంటే సమస్య ఉన్నట్టు గుర్తించాలి.
మీటర్ పాడై అలా జరుగుతోందా...? లేక రహస్యంగా మీ మీటర్ కు వేరే వారి విద్యుత్ వైరు అనుసంధానమైందా? అన్నది ఎలక్ట్రీషియన్ సాయంతో తెలుసుకోవాలి. అలా వేరే ఏ ఇతర వైర్ కూడా మీ మీటర్ కు అనుసంధానమైనట్టు లేకపోతే సమస్య మరో చోట ఉన్నట్టే.
మెయిన్ ఆన్ చేసి... ఇప్పుడు ఒక్కో పరికరాన్ని మాత్రమే ఆన్ చేస్తూ రీడింగ్ సరిగ్గా ఉందేమో పరిశీలించాలి. ఒక కిలోవాట్ విద్యుత్ వినియోగంతో ఒక యూనిట్ మాత్రమే పెరగాలి. దీన్ని తెలుసుకోవాలంటే వన్ టన్ ఏసీ ఒక గంటపాటు ఆన్ చేసి ఉంచండి. ఒక యూనిట్ ఖర్చవుతుంది. లేదా 100 వాట్ల బల్బ్ ను 10 గంటల పాటు ఉంచినా ఒక యూనిట్ వ్యయం అవుతుంది. దాన్ని బట్టి మీటర్ రీడింగ్ సరిగ్గా ఉందో, లేదో తెలుస్తుంది.

loading...