News and Entertainment

రాముడు హంతకుడా..?! హిందూ దేవుళ్లకే ఈ గతి ఎందుకు..?


వేదాలు, పురాణాలు, గ్రంథాలు.. ఇలా అన్నీ కూడా రాముడు, కృష్ణుడు, దుర్గ, లక్ష్మీదేవి ఇలా ఆయా దేవుళ్లు, దేవతా రూపాలను తెలుపుతూ వారి యొక్క పుట్టుక.. విశిష్టతను వివరిస్తూ జాతిని జాగృతం చేసే దిశగానే వెళతాయి. ఏ పండుగ వచ్చినా ఆ పండుగ వెనుక ఓ అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థాలను తెలిపే మహాగ్రంథాలను భవిష్య తరాలకు అందించిన మహాకవులు ఎన్నో ఆధారాలు సేకరించి, జీవితాలను కాచి వడబోసి అందించిన మహోన్నతమైన కావ్యాలలోని అంశాలపై నేడు విపరీర్థాలు తీస్తున్నారు కొందరు. అంతేకాదు ఆనాటి వాస్తవ పరిస్థితులకు కొత్త ముసుగులు తొడిగి వక్రీకరించి ఏకంగా దేవుళ్లుగా కొలిచే మూర్తులనే దూషించే కార్యక్రమం గత కొన్నేళ్లుగా జరుగుతూనే వస్తోంది.

అసలెందుకు హిందూ దేవుళ్లకే ఈ గతి…? అని చూస్తే చాలా విషయాలు మనకు స్ఫురిస్తాయి. అలా కాసేపు ఓ దేవాలయం వద్ద నిలబడినా… లేదంటే భక్తిగా పూజలు జరిపిన ఓ వ్యక్తి తారసపడినా… కొంతమంది నేరుగా చేసే కామెంట్లు దీనికి నిలువుటద్దాలుగా ఉంటాయి. దేవుడిని పూజించి కుంకుమ పెట్టుకుంటే… పెట్టాడ్రా బొట్టు.. అబ్బో వీడి భక్తికి నేరుగా దేవుడే దిగి వస్తాడా..? అంటూ కామెంట్ చేసేవాళ్లు తక్కువేం లేరు. అలాఅని అందరూ ఇలానే ఉన్నారని చెప్పకూడదు. కడవెడు పాలలో ఓ చుక్క విషమేస్తే ఫలితమేమిటో అలాగే మత విశ్వాసాలపై చిటికెడు విపరీతపు మాటలు ఎంతోమంది హృదయాలను గాయపరుస్తాయి.

ఐనా దేవుళ్లపై ఇలాంటి వక్రీకరణ, చులకన భావనలతో సదరు మతాలకు చెందిన దేవుళ్లు లేదా దేవతలను కించపరచడం వల్ల భవిష్య తరాలకు ఇచ్చే సందేశమేమిటి..? మీరు కూడా రాముడు, కృష్ణుడు, ఇంకా ముక్కోటి దేవతలలో “లేని” తప్పులు వెదికి తిడుతూ విశ్వాసాలకు పాతరేయమనేనా..? సైన్స్ పరిజ్ఞానం గ్రహాంతరాలకు దూసుకవెళుతున్నా.. ఇంకా ఆ సైన్సును నమ్ముకున్నవారు ఓ అదృశ్య “శక్తి”ని నమ్ముతున్నారంటే దానికి కారణాలను విడమర్చి చెప్పక్కర్లేదు.

శూన్యంలో సూర్యుడు చుట్టూ భూమి తిరగడాన్ని సూర్యునికి ఉన్న శక్తి అని మన చెప్పుకుంటున్నా… శూన్యంలో ఓ చిన్న గోళంపై సమస్త జీవులు తమ జీవనాన్ని సాగిస్తున్నాయంటే ప్రకృతే కారణమని అంటున్నా… వీటన్నిటి వెనుకా ఓ అదృశ్య శక్తి ఉంది. కాదనగలమా…? అలాగే ఉదయం లేచినది మొదలు రాత్రి నిద్రించే వరకూ ఎక్కడో ఓ దగ్గర ప్రతి మనిషీ ఓ విశ్వాసాన్ని నమ్ముతాడు. దానికి శిరసు వంచి సాష్టాంగ ప్రమాణం చేసి తన జీవితం ఉన్నతంగా ఉండాలని ప్రార్థిస్తాడు. ఇది నిజం కాదా..?

అలాగే దేశం, ప్రపంచం… ఇలా పేరు ఏదయినప్పటికీ చరాచర జగత్తులో సమస్త జీవకోటికీ ఓ నమ్మకం.. ఓ విశ్వాసం.. ఓ దేవుడు… ఖచ్చితంగా ఉన్నారు. ఆ నమ్మకమనే శక్తిపై భారం వేసి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటప్పుడు వారివారి నమ్మకాలను కించపరిచే హక్కు మనకు ఎక్కడిది..? అందుకే ఎవరు నమ్మకాలు వారివి. వాటిని గౌరవిస్తూ ముందుకు కదలడమే మానవులుగా మనం చేయాల్సిన పని. అది భవిష్య తరాలకు మంచి దీవెన. మరి మీరేమంటారు..?
షేర్ చేయండి


loading...