News and Entertainment

ఈ మధ్య క్రికెట్ అంపైర్లను చూశారా?? వాళ్ల ఎడమచేతిని ఓ సారి గమనించండి


మైదానంలో ఆడే ఏ ఆట‌లోనైనా క్రీడాకారులు తమ ర‌క్ష‌ణ కోసం త‌గిన ప‌రిక‌రాల‌ను ధ‌రించి ఆట‌లోకి దిగుతారు. అయిన‌ప్ప‌టికీ వారికి 100 శాతం ర‌క్ష‌ణ ఉంటుంద‌ని చెప్ప‌లేం. కానీ స‌ద‌రు ప‌రిక‌రాల వ‌ల్ల ఎంతో కొంతైతే సేఫ్టీ ల‌భిస్తుంది క‌దా. అయితే ప్ర‌ధానంగా క్రికెట్ ఆట విష‌యానికి వ‌స్తే అందులో ప్లేయ‌ర్లు మాత్ర‌మే సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ధ‌రిస్తారు. కానీ మ‌ధ్య‌లో నిల‌బ‌డి అంపైరింగ్ చేసే అంపైర్ల‌కు మాత్రం స‌రైన ర‌క్ష‌ణ ఉండదు. బ్యాట్స్‌మెన్ బ‌లంగా మోదిన బంతి నేరుగా వ‌చ్చి తాకితే ఇక ఆ అంపైర్‌కు త‌ప్పించుకునేందుకు అవ‌కాశం కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో వారికి తీవ్రంగా గాయాలు అయ్యేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. కానీ ఇప్పుడిక అంపైర్లు త‌మ సేఫ్టీ గురించి బాధ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే క్రికెట్ ఆడేట‌ప్పుడు వారికి ర‌క్ష‌ణ‌గా ఉండేందుకు ఓ కొత్త ప‌రికరాన్ని ఐసీసీ తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

ఇటీవ‌ల భార‌త్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌ను చూశారా..? అందులో భార‌త్ విజ‌యం కూడా సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్‌ను కూడా మీరు గ‌మ‌నించే ఉంటారు. అత‌ని చేతికి ఓ ప‌రిక‌రం కూడా అమ‌ర్చ‌బ‌డి ఉంది. అయితే చాలా మందికి దాని గురించి తెలియ‌దు. ఆట‌లో ఏదైనా సాంకేతిక అవ‌స‌రం కోసం అంపైర్ దాన్ని ధ‌రించి ఉంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అదేం కాదు. ఆ ప‌రిక‌రం అంపైర్‌కు సేఫ్టీనివ్వ‌డం కోసం త‌యారు చేయ‌బ‌డిందే. దాన్ని ఫోర్ ఆర్మ్ షీల్డ్ (forearm shield) అని పిలుస్తారు.


ఫోర్ ఆర్మ్ షీల్డ్ ను ఐసీసీ ఇంత‌కు ముందు జ‌రిగిన ఒక‌టి రెండు వ‌న్డే మ్యాచ్‌ల‌లోనూ అంపైర్ల‌కు ఇచ్చింది. అంతెందుకు గ‌త ఏప్రిల్‌, మే నెల‌ల్లో జ‌రిగిన ఐపీఎల్ టీ20 మ్యాచ్‌ల‌లోనూ దీన్ని అంపైర్లు వాడారు. కానీ దాదాపుగా చాలా త‌క్కువ మంది దీన్ని చూశారు. అయితే భార‌త్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య జ‌రిగిన మొన్న‌టి వ‌న్డే మ్యాచ్‌తో దీన్ని ఐసీసీ అఫిషియ‌ల్‌గా విడుద‌ల చేసింద‌ని తెలిసింది. ఇక‌పై దాదాపు అన్ని మ్యాచ్‌ల‌లోనూ అంపైర్లు ఈ ప‌రిక‌రాన్ని తొడుక్కోనున్నారు. అంతేగా మ‌రి, వారు కూడా మ‌నుషులేగా. త‌గ‌ల‌రాని చోట బాల్ త‌గిలితే ఇక అంతే సంగ‌తులు. గ‌తంలో కొంద‌రు ప్లేయ‌ర్లే కాదు, అంపైర్లు కూడా క్రికెట్ బాల్స్ బారిన ప‌డి మృతి చెందిన సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అంపైర్ల‌కు ఇలాంటి సేఫ్టీ ప‌రిక‌రం అందుబాటులోకి రావ‌డం వారికి ఒకింత సంతోషం క‌లిగించే విషయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు క‌దా..!