News and Entertainment

అబుదాబీ లో మొట్టమొదటి హిందూ దేవాలయం


హిందువుల కోసం అబుదాబిలో మొదటిసారిగా ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. అబుదాబిలో ప్రభుత్వం ఈ గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని ప్రభుత్వం వితరణగా ఇచ్చింది. సోమవారంనాడు అధికారికంగా ఈ భూమిని అప్పగించింది. వేలాది మంది హిందువులు నివసిస్తున్న అబుదాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది పర్యటించిన నేపథ్యంలో ఈ గుడి నిర్మాణం తెరమీదకొచ్చింది. ఇందుకు అవసరమైన భూమిని కేటాయిస్తామని అబుదాబీ ప్రభుత్వం ఆ సందర్భంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అబుదాబి నగరం వెలుపల ఆల్‌ వాత్బాలో 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్టు భారత్‌కు చెందిన వ్యాపారవేత్త, ఎన్ఎంసి హెల్త్‌కేర్ అండ్ యూఏఈ ఎక్స్చేంజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీఆర్ శెట్టి తెలిపారు.


టెంపుల్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. అబుదాబీ సిటీ నుంచి అల్ వాత్బా 30 నిమిషాల జర్నీ ఉంటుందని, ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఏడాదిలోగా హిందూ ఆలయ నిర్మాణం జరుపుతామని, ఏడెనిమిది నెలల్లో కూడా పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆలయం లోపల శ్రీకృష్ణుడు, ఈశ్వరుడు, అయ్యప్ప తదితర దేవుళ్ల విగ్రహాలు ఉంటాయన్నారు. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణానికి అనుమతి మాత్రమే రాగా, సోమవారంనాడు భూమి కేటాయింపు జరిగిందని చెప్పారు. ప్రస్తుతం దుబాయిలో మాత్రమే రెండు హిందూ ఆలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అబుదాబిలో భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు.