News and Entertainment

జియో కు శుభవార్త...వినియోగదారులకు చేదు వార్త..!




ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందిస్తామని ప్రకటించిన రిలయన్స్ జియో రోజుకో కొత్త రికార్డ్ సృష్టిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టే కనిపిస్తోంది. ఉచిత వాయిస్ కాల్స్ ప్రకటన రిలయన్స్ జియోకు బాగా కలిసొచ్చింది. ఈ ప్రకటనతో ఇతర కంపెనీలు ఢమాలన్నాయి. ఇంతకీ ఇప్పుడు అసలు విషయమేంటంటే సెప్టెంబర్ 30 నాటికి 24 మిలియన్ల మంది జియో యూజర్లుగా మారారని సంస్థ ప్రకటించింది. రిలయన్స్ జియో అందుబాటులోకి వచ్చిన ఒక్క నెలలోపే 16 మిలియన్ల మంది యూజర్లకు జియో చేరువయిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ఇది రిలయన్స్ జియో యాజమాన్యానికి శుభవార్తే అయినప్పటికీ యూజర్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. యూజర్లు పెరిగే కొద్దీ ఇంటర్నెట్ వేగం తగ్గిందని చెబుతున్నారు. ఇది కేవలం యూజర్ల మాట మాత్రమే కాదు, ట్రాయ్ కూడా పరోక్షంగా ఈ విషయాన్నే వెల్లడించింది.


ఇండియాలోని టెలికాం కంపెనీలు అందిస్తున్న డేటా స్పీడ్‌లో రిలయన్స్ జియో చాలా స్లోగా ఉందని టెస్ట్‌లో తేలింది. అయితే జియో మాత్రం ఈ లెక్కలని కొట్టి పారేస్తోంది. రోజువారీ యూజర్లకు అందించే 4జీబీ డేటా చాలా స్పీడ్‌గా ఉంటుందని, ట్రాయ్ ఆ అనంతరం ఇచ్చే డేటా స్పీడ్ గురించి మాత్రమే ప్రస్తావించిందని రిలయన్స్ జియో యాజమాన్యం చెబుతోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఉన్న జియో యూజర్లలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు టాప్‌లో ఉన్నట్లు ప్రకటించింది. గుజరాత్‌లో 1.5 మిలియన్ యూజర్లు, తెలంగాణలో 1.2 మిలియన్ల మంది యూజర్లు ఉన్నట్లు తెలిపింది. దేశంలోనే అతి పెద్ద మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబైలో అతి తక్కువ మంది జియో యూజర్లు ఉన్నట్లు జియో ప్రకటించడం విశేషం.