News and Entertainment

ఒక్క రూపాయికే వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్...!


భారత స్మార్ట్‌ఫోన్ రంగంలో చైనా కంపెనీలు తమ హవాను కొనసాగిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పోటీ పడి మరీ ఆఫర్లను ప్రకటించేస్తున్నాయి. జియోమి 1 రూపాయికే స్మార్ట్‌ఫోన్ ఇస్తామని వినియోగదారుల్లో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది వినియోగదారులు మాత్రం ఈ ఫ్లాష్ సేల్‌ ఒట్టి బోగస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. 1 రూపాయికే స్మార్ట్‌ఫోన్ అని ప్రకటించడంతో చాలామంది బుకింగ్ టైం వరకూ వేచి చూశారు.


తీరా కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యే సమయానికి ఔట్ ఆఫ్ స్టాక్ అని కనిపించడంతో అందరిలోనూ నిరాశ నెలకొంది. అయితే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కూడా ఒక్క రూపాయికే వన్‌ ప్లస్ 3 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని తాజాగా ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఈ ఫ్లాష్ సేల్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి 26 వరకూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు, 6 గంటలకు, 8 గంటలకు ఈ ఫ్లాష్ డీల్‌లో వినియోగదారులు వన్ ప్లస్ 3ని బుక్ చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇలా బుక్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని చెప్పారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని ఎక్కువ బుకింగ్స్ సాధించాలని సంస్థ భావిస్తోంది.