News and Entertainment

బెర్ముడా ట్ర‌యాంగిల్ వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యాన్ని ఛేదించిన సైంటిస్టులు.!?


ఈ భూ ప్ర‌పంచంమే కాదు, అస‌లు మొత్తం విశ్వ‌మంటేనే అనేక వింత‌లు, విశేషాల‌కు నిల‌యం. వాటిలో మ‌న‌కు రోజుకో కొత్త విష‌యం తెలుస్తూనే ఉంది. అయినా మ‌నిషి ప్ర‌య‌త్నాలు మాత్రం ఆగ‌డం లేదు. విశ్వంలో ఇంకా దాగి ఉన్న ఎన్నో విశేషాల‌ను తెలుసుకోవాల‌ని ఎప్ప‌టికప్పుడు ఉవ్విళ్లూరుతూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో కొన్ని విష‌యాల‌ను మాత్రం తెలుసుకుంటున్నాడు, కానీ కొన్ని మాత్రం ఎప్ప‌టికీ మిస్ట‌రీలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి వాటిలో పేరుగాంచింది బెర్ముడా ట్ర‌యాంగిల్‌. కొన్ని శ‌తాబ్దాల కాలం నాటి నుంచి బెర్ముడా ట్ర‌యాంగిల్ ఓ మిస్ట‌రీగానే మారిపోయింది. కానీ దాన్ని ఎవరూ ఛేదించ‌లేక‌పోయారు. అయితే సైంటిస్టులు ఈ ట్ర‌యాంగిల్ వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యాన్ని క‌నిపెట్టేశార‌ట‌.


మియామి, ప్యూర్టోరికో, బెర్ముడాల మ‌ధ్య విస్త‌రించి ఉన్న‌దే బెర్ముడా ట్ర‌యాంగిల్‌. ఎన్నో వంద‌ల సంవత్స‌రాల కాలం నుంచి ఇదొక మిస్ట‌రీగా మారిపోయింది. కార‌ణం అక్క‌డ సంచ‌రించే షిప్పులు లేదంటే విమానాలు ట్ర‌యాంగిల్‌లో ప‌డి అదృశ్య‌మ‌వుతుండ‌డ‌మే. అయితే అలా అవి ఎందుకు మిస్ అవుతున్నాయో ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌రకు చెప్ప‌లేక‌పోయారు. దాని ర‌హ‌స్యాన్ని ఛేదించాల‌ని చూసి కూడా చాలా మంది విఫ‌ల‌మ‌య్యారు. కొంద‌రైతే ఏకంగా త‌మ ప్రాణాల‌నే పోగొట్టుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ప‌లువురు సైంటిస్టులు ఈ ట్ర‌యాంగిల్ వెనుక ఉన్న అస‌లు ర‌హస్యాన్ని ఛేదించేశారు కూడా. అక్క‌డ షిప్పులు, విమానాలు ఎందుకు అదృశ్య‌మ‌వుతున్నాయో వారు వివ‌ర‌ణ‌లు కూడా ఇచ్చారు.



చిత్రంలో చూశారుగా. ష‌డ్బుజి (హెగ్జాగాన్‌) ఆకారంలో కూడిన మేఘాలు బెర్ముడా ట్ర‌యాంగిల్ ప్ర‌దేశంలోని వాతావ‌ర‌ణంలో సుమారు 20 నుంచి 50 మైళ్ల పొడ‌వున ఒక్కొక్క‌టి విస్త‌రించి ఉన్నాయి. నిజానికి సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే ఇవి సాధార‌ణ మేఘాలు కావ‌ట‌. వీటిని ఎయిర్ బాంబ్స్ అని పిలుస్తార‌ట‌. అంటే ఇవి గాలి శ‌క్తితో కూడిన పెద్ద పెద్ద బాంబుల‌న్న‌మాట‌. సాధార‌ణ బాంబుల‌లాగే ఇవి కూడా విస్ఫోట‌న శ‌క్తిని క‌లిగి ఉంటాయి. అయితే అది గాలి రూపంలో ఉంటుంది. అలా విస్ఫోట‌నం చెందిన‌ప్పుడు అక్క‌డి వాతావ‌ర‌ణంలో ఉండే గాలి అప్ప‌టిక‌ప్పుడే 170 మైళ్ల వేగాన్ని అందుకుంటుంద‌ట‌. దీంతో ఆ ప్ర‌దేశానికి స‌మీపంలో ఉన్న షిప్పులు, విమానాలు కూడా ఆ గాలి శ‌క్తి నిల‌వ‌లేవ‌ట‌. అందుకే అవి స‌ద‌రు ట్ర‌యాంగిల్‌లో అదృశ్య‌మ‌వుతున్నాయ‌ని సైంటిస్టులు తేల్చేశారు. అయితే స‌ద‌రు ష‌డ్బుజి మేఘాలు అక్క‌డే ఎందుకు ఉన్నాయనే విష‌యాన్ని మాత్రం సైంటిస్టులు చెప్ప‌లేదు. దానికి కూడా వారికి త్వ‌ర‌లో స‌మాధానం దొరుకుతుంద‌నే ఆశిద్దాం.