News and Entertainment

దేవుడూ! నీ వయస్సెంత?హింసకి మతం లేదు. దుర్మార్గమయిన మారణకాండకి యువతని ఫణంగా పెట్టే అమానుషత్వానికి హృదయం లేదు. ఇంతకూ యువతను ఉసికొల్పే ముష్కరుల గుండెల్లో తిష్ట వేసుకున్న ఆ నల్లదేవుడి వయస్సెంత?  నొప్పించి ఒప్పించడం అతి ప్రాథమికమయిన మన స్తత్వం. తన ఆలోచన వేపుకో, తన విశ్వాసాల మార్గాన్నో మనల్ని తిప్పుకోవడానికి - తిరగక తప్పదని హెచ్చరించి హింసించడం ఇవాళా రేపూ ప్రపంచమంతటా సాగుతున్న ఉద్యమం. అయితే భయపెట్టే కారణం అది కాదు. ఈ దారుణాలు చేస్తున్నది- లేదా మత మౌఢ్యం పేరిట ముగ్గులోకి దిగుతున్నది- కనీసం 22 ఏళ్లయినా నిండని యువత. చేతికి తుపాకీ ఇస్తే- కారణం మనసుదాకా పోకుండానే ఆవేశపడే వయసు అది.

 నిర్దుష్టమైన ఆలోచనా సరళి, విచక్షణ కంటే ఆవేశం ముందుకు దూకే దశ అది. అతి పదునైన కత్తి యౌవనం. వీరికి మత మౌఢ్యాన్ని తలకెక్కించి, చేతికి ఆయుధాన్ని ఇస్తే ఏమవుతుంది? చాలామంది యువకుల్ని నమ్మించి, కార్యోన్ముఖులని చేస్తున్న ఇస్లాం అతివాద సంస్థ (ఐఎస్‌ఐఎస్) నిర్వాకం ఇది.

 మొన్న బంగ్లాదేశ్‌లో హోలీ ఆర్టిసాన్ బేకరీ రెస్టారెంట్‌లోకి దౌర్జన్యకారులు జొరబడి కేవలం 20 నిమిషాలలో 20 మందిని తుపాకులతో చంపలేదు. బాంబులు పేల్చలేదు. రివాల్వర్లు వాడలేదు. దారుణంగా అందరి పీకలు కత్తులతో కోసి చంపారు. ఎవరీ దౌర్జన్యకారులు? 20 ఏళ్ల రోహన్ ఇంతియాజ్. వాళ్ల అత్త ఇతని కంప్యూటర్‌లో మతం, దౌర్జన్యం ప్రసక్తిని చూసి షాక్ అయింది. వాళ్ల అమ్మానాన్నా  వైద్యం కోసం ఇండి యాకి వచ్చారు. ఉన్నట్టుండి కుర్రాడు మాయమ య్యాడు. మొన్న రెస్టారెంట్‌లో మారణహోమానికి పాత్ర వహించి దారుణంగా చచ్చిపోయాడు. మీర్ సామే ముబాషెర్ కేవలం 18 ఏళ్ల కుర్రాడు.

 ఆ వయసులో చావునీ, హత్యనీ చూస్తే నరాలు ఎదురు తిరుగుతాయి. కారులో మసీదులో కోచింగు క్లాసుకి వెళ్లాడు. మరి తిరిగి రాలేదు. సరదాగా ఇంట్లో కూర్చుని సితార్ వాయించు కునే ఈ కుర్రాడిలో ఏదో మార్పు వచ్చిందని పెద్దలు గమనించారు. ‘‘సంగీతం మంచిదికాదు’’ అన్నాడట. తండ్రి పెద్ద ఉద్యోగి. తల్లి కాలేజీ టీచర్. మాయమైన ఈ కుర్రాడు 20 మందిని ఊచకోత కోసి, దారుణంగా చంపబడినవారిలో ఒకడు. ఖైరుల్ ఇస్లాం పేయల్‌కి 20 ఏళ్లు.  ఓ రోజు కూలీ కొడుకు. నిబ్రస్ ఇస్లాంకి 22 ఏళ్లు.

 మలేసియాలో చదువుకున్నాడు. చాలా నెమ్మదయిన కుర్రాడు. పేరులో తప్ప మతం జోలికి వెళ్లే మనిషి కాదు. చంపి, చచ్చిపోయిన వారిలో ఒకడు. మెహదీ బిస్వాస్‌కి 24 ఏళ్లు. చదువుని వెర్రితలలు వేయించి- దౌర్జన్యకా రుల సమాచారాల్ని రహస్యంగా చేరవేసే యంత్రాం గాన్ని నడిపి అరెస్టయ్యాడు. 18, 22 ఏళ్ల కుర్రాళ్లు 20 మందిని దారుణంగా చంపి 20 శవాల మధ్య ధైర్యంగా నిలబడి ‘మేం వెళ్తున్నాం. మిమ్మల్ని స్వర్గంలో కలుస్తాం’ అనే తెగింపునీ, విశ్వాసాన్నీ  ఐఎస్‌ఐఎస్ కల్పించింది. మతం పేరిట, దేవుడి పేరిట- నరాల్లోంచి చలి పుట్టించే ఘాతుకం ఇది. ఈ రెస్టారెంట్‌లో చచ్చిపోయిన వారిలో - దాదాపు చంపిన వారి వయసున్న పిల్లలు ఉన్నారు. తారిషి జైన్ (18), అబింతా కబీర్ (19), ఫరాజ్ ఆయుజ్ హుస్సేన్ (20). గొంతు కోస్తున్న పిల్లలు గొంతు తెగుతున్న పిల్లల్లో ఇద్దరు తమ మతాన్నే, తమ దేవుడినే నమ్ముతా రని గుర్తించలేదు. పైగా రంజాన్ పండుగ సమయమిది. వాళ్లు బంగ్లాదేశ్‌లో ఒక అమెరికన్ స్కూలులో చదువు కుంటున్నారు. ఈ మారణకాండ ప్రారంభమయిన - 20 నిమిషాలలో వాళ్లతో ఉన్న ఫరాజ్ హుస్సేన్ అనే కుర్రాడు పారిపోలేదు. వారికి దన్నుగా నిలబడ్డాడు. ఫలి తం - అతని మెడనీ అదే వయసున్న కుర్రాళ్లు కోశారు. అలనాడు ముంబైలో జరిగిన మారణహోమంలో 80 క్రిమినల్ ఆరోపణలతో మరణ దండనను అను భవించిన అజ్మల్ కసబ్ వయసు హత్యలు చేసే నాటికి 21 సంవత్సరాలు. ఈ సంఘటన జరిగిన ఒక్కరోజు తర్వాత- బాగ్దాద్‌లో 215 మందిని దారుణంగా చంపారు. మరో 175 మంది గాయపడ్డారు. 81 శరీరాలు గుర్తు తెలియ కుండా కాలిపోయాయి. ఈ చచ్చిపోయిన వాళ్లలో తన పుట్టిన రోజు జరుపుకోవడానికి తన మిత్రులతో వెళ్లిన పద్దెనిమిదేళ్ల కుర్రాడి శవాన్ని ముసలి తల్లిదండ్రులు వెదుక్కుంటున్నారట. మరొకాయన ఈ పండుగ సంద ర్భంగా తమ పిల్లలకి కొత్త బట్టలు కొనడానికి వెళ్లిన అయిదుగురు బంధువుల శవాలని వెతుకుతున్నాడు.

ఇలాంటి దౌర్జన్యాన్ని మన దేశంలోనూ సృష్టించ డానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన నేపథ్యంలో అయిదుగురు ముస్లిం యువకులు మొన్ననే అరెస్ట య్యారు.  హింసకి మతం లేదు. దుర్మార్గమయిన మారణ కాండకి యువతని ఫణంగా పెట్టే అమానుషత్వానికి హృదయం లేదు. ఇంతకూ యువతను ఉసికొల్పే ముష్కరుల గుండెల్లో తిష్ట వేసుకున్న ఆ నల్లదేవుడి వయస్సెంత?
 - గొల్లపూడి మారుతీరావు(source:sakshi)