News and Entertainment

మోడీని చంపుతామంటూ ఫోన్... అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు


ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు ఓ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. ఫోన్ కాల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రస్తుతానికి దీన్ని ఇది ఆకతాయి పనిగానే పరిగణనిస్తున్నారు.
ఇటీవల గోవాలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ తన ప్రాణాలకు ముప్పుందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. బరౌరీలో నివాసం ఉండే దినేశ్ కుమార్ పేరుతో జారీ అయిన నెంబరు నుంచి శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది.

దిల్షాద్ కాలనీ నుంచి కాల్ వచ్చినట్లు ట్రేస్ చేసిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో సిమ్ తీసుకున్న దినేశ్ కుమార్‌ను పట్టుకుని విచారించారు. ప్రస్తుతం ఆ నెంబరును తన బంధువు వాడుతున్నట్లు దినేశ్ చెప్పడంతో అతడిని ప్రశ్నించారు.
దిల్షాద్ కాలనీలో దుకాణం దగ్గర నిలబడి ఉన్నప్పుడు అటుగా వెళుతున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి తన దగ్గరకు వచ్చి అర్జంటుగా కాల్ చేసుకోవాలని నా ఫోన్ అడిగి తీసుకున్నాడని అతడు పోలీసులకు తెలిపాడు.