News and Entertainment

మీ వద్ద రూ.500,1000 నోట్లుంటే ఇప్పుడేం చెయ్యాలో తెలుసుకోండి...!



చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లు మొత్తాన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన ఈ సంచలన నిర్ణయం ప్రకటించిన దగ్గరి నుంచీ ప్రజల్లో ఎన్నెన్నో సందేహాలు. తమ దగ్గర ఉన్న నోట్లు ఏం చేయాలి? కొత్త నోట్లు పొందడం ఎలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇవీ సమాధానాలు..

బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తాయా?
ఈ బుధ, గురువారాల్లో ఏటీఎంలు పనిచేయవు. బ్యాంకులు బుధవారం ఒక్క రోజు పనిచేయవు. సాంకేతికపరమైన చర్యలు సకాలంలో పూర్తయిన చోట్ల గురువారం ఏటీఎంలు పనిచేసే అవకాశం ఉంది.

పాత 500, 1,000 నోట్లు మార్చుకునేదెలా?
ఈ నోట్లు ఉన్న వారు గురువారం (10వ తేదీ) నుంచి డిసెంబరు 30లోగా బ్యాంకులు లేదా హెడ్‌ పోస్టాఫీసులు, సబ్‌ పోస్టాఫీసులకు వెళ్లి వాటిని ఇచ్చేసి చెల్లుబాటయ్యే వేరే డినామినేషన్‌ నోట్లు తీసుకోవచ్చు. నోట్లు మార్చుకునే ప్రతి వ్యక్తీ తన ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

ఎంతైనా మారుస్తారా?
ఈనెల 24 వరకు ఒక్కో వ్యక్తీ రూ.4 వేల వరకే మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఈ మార్పిడిపై పరిమితిని ఎత్తేస్తారు.

బ్యాంకు ఖాతాలో వేసుకోవచ్చా?
బ్యాంకుల్లోని తమ ఖాతాల్లోనైతే ఈ పాత నోట్లను ఎన్నింటినైనా తీసుకెళ్లి డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇక్కడ పాన్‌, ఐటీకి సంబంధించిన పాత నిబంధనలు యథాతథంగా వర్తిస్తాయి.

ముందు బ్యాంకులో వేసి ఎంతైనా విత్ డ్రా చేయొచ్చా?
ప్రజల రద్దీని బట్టి బ్యాంకుల్లో వితడ్రాయల్స్‌పై ఎక్కడికక్కడ పరిమితులు విధిస్తారు. మొదట్లో రోజుకు రూ.10 వేలు, వారానికి రూ.20 వేల మేరకు మాత్రమే వితడ్రాయల్స్‌ను అనుమతిస్తారు. 24వ తేదీ వరకు ఈ పరిమితి కొనసాగుతుంది. తర్వాత రద్దీని బట్టి సడలింపు ఉంటుంది.

ఖాతాలో ఉన్నా విత్‌డ్రా చేసుకోలేకుంటే చెల్లింపులు ఎలా?
రద్దయిన నోట్లను ముందు బ్యాంకులో వేసేశాం. బాగానే ఉంది. కొత్తవి తీసుకుందామంటే వితడ్రాయల్స్‌పై పరిమితులు పెట్టారు. ఇలాంటప్పుడు మరి చెల్లింపులు ఎలా అన్న సందేహం రావడం సహజం. నగదేతర లావాదేవీలకు ఎలాంటి అంతరాయమూ ఉండదు.

అంటే ఖాతాలో వేశాక చెక్కుల ద్వారాను, డెబిట్‌ కార్డుల ద్వారాను, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలోనూ చెల్లింపులు, నగదు బదిలీలు యథాతథంగా చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్‌ కార్డుల ద్వారానూ చెల్లింపులు చేయొచ్చు. డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌నూ తీసుకొని వాడుకోవచ్చు.

ఏటీఎంల నుంచి కొత్త నోట్లే వస్తాయా?
ఏటీఎంలలో ఉన్న రద్దయిన పాత నోట్లన్నింటినీ తీసేసి, కొత్తవి పెట్టేందుకే బుధ, గురువారాలు వాటిని మూసేస్తారు. అవి పనిచేయడం ప్రారంభించగానే అన్నీ చెల్లే కొత్త నోట్లే వస్తాయి. కాకుంటే వితడ్రాయల్‌పై పరిమితి, ప్రజలకు చిన్న నోట్ల అవసరం దృష్ట్యా కొద్దిరోజుల పాటు రూ.50, 100 నోట్లే ఏటీఎంలలో ఉంచుతారు.

డిసెంబరులోపు మార్చుకోలేక పోతే?
అనివార్య కారణాల వల్ల డిసెంబరు 30లోగా బ్యాంకుకు వెళ్లి పాత నోట్లను మార్చుకోలేకపోయిన వారు మిగిలి ఉంటే వారికి మరో అవకాశమూ ఇస్తారు. నిర్దేశిత ఆర్‌బీఐ కార్యాలయాలకు వెళ్లి, నిర్ణీత ప్రమాణ పత్రం సమర్పించి 2017 మార్చి 31లోగా పాత నోట్లను వారు మార్చుకోవచ్చు.

ఏటీఎంల నుంచి ఎంతైనా తీసుకోవచ్చా?
ఇప్పటికిప్పుడు అలా తీసుకోవడం కుదరదు. కొత్త నోట్ల కోసం ఉండే భారీ డిమాండ్‌ను ఎదుర్కోవడం కోసం ఏటీఎం వితడ్రాయల్స్‌పైనా పరిమితులు విధించారు. ఈ నెల 18 వరకు ఒక్కో కార్డుపై రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి కుదురుతుంది. 19 నుంచి రూ.4 వేలు తీసుకునేందుకు అనుమతిస్తారు.

ఇక అన్నీ చిన్న నోట్లేనా?
500, 1,000 రద్దు చేసినా.. అత్యంత భద్రతా ప్రమాణాలతో కొత్త రూ.500 నోట్లను వెంటనే అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు కొత్తగా రూ.2,000 నోట్లూ గురువారం నుంచే అందుబాటులోకొస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో హై సెక్యూరిటీ వెయ్యి నోట్లనూ మళ్లీ విడుదల చేస్తారు.

బ్యాంకుల వేళలు పెంపు

పెద్ద నోట్లు చెల్లని చిత్తు కాగితాలుగా మారడంతో పాత వాటిని మార్చుకోవడానికి జనం పోటెత్తడం ఖాయం. ఈ రద్దీని తట్టుకోవడం కోసం బ్యాంకుల్లో గురువారం నుంచి అదనపు కౌంటర్లు పెడతారు. బ్యాంకింగ్‌ వేళలనూ పెంచుతారు. నోట్ల ఆకస్మిక రద్దు నేపథ్యంలో బ్యాంకింగ్‌ పరంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితినైనా ఎదుర్కోవడం కోసం ముంబై, ఢిల్లీల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.