News and Entertainment

బంపర్ ఆఫర్... 18వేల ఫోన్ 4 వేలకే.... కానీ వద్దన్నవాడే అదృష్టవంతుడు


‘ఆలసించిన ఆశాభంగం.. మీ మొబైల్‌ నెంబర్‌పై అద్భుతమైన ఆఫర్‌.. రూ. 18 వేల విలువగల సామ్‌సంగ్‌ గ్యాలక్సీ జే7 ఫోన్‌.. కేవలం రూ. 4 వేలకే మీ సొంతం. పిన్‌కోడ్‌ నెంబర్‌ చెబితే చాలు.. పార్శిల్‌ మీ ఇంటికే వస్తోంది. పార్శిల్‌ అందగానే ఇంటివద్దే డబ్బు చెల్లించొచ్చు’ అని ఓ యువతి ఫోన్‌లో మాటలు. ఇంత మంచి ఆఫర్‌ను వద్దనుకుంటే.. నీలాంటి మూర్ఖుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అందరికీ ఈ అవకాశం రాదు. నాలుగు వేలు చాలా తక్కువ మొత్తం. వెంటనే ఆర్డర్‌ ఇవ్వు.
ఈ విషయం బయటి వ్యక్తులకు చెప్పొద్దు అని ఓ యువకుడు ఫోన్‌ చేసి ఊకదంపుడు ఉపన్యాసం. ఆర్డర్‌ ఇచ్చే వరకూ తరచూ ఫోన్లు. ఆర్డర్‌ ఇచ్చాక.. డబ్బు చెల్లించాక వచ్చిన పార్శిల్‌ ఓపెన్‌ చేస్తే షాక్‌. అందులో తాబేలు బొమ్మ, రెండు దండలు. ఇదీ.. శివారులో అమాయకులను కేటుగాళ్లు మోసం చేస్తున్న తీరు. మోసపోయిన బాధితులు లబో దిబోమంటూ పోలీస్‌స్టేషన్ల గడప తొక్కుతున్నారు. తమ పరిధికి రాదంటూ పోలీసులు చెప్పడంతో.. సైబర్‌ క్రైం స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మూడు రోజుల్లోనే 10 మంది బాధితులు తమ గోడును పోలీసుల వద్ద వెళ్లబోసుకున్నారు.

గ్రామీణులకే బురిడీ
మహేశ్వరానికి చెందిన నరేందర్‌.. రాజేంద్ర నగర్‌లో ఓ క్యాటరింగ్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఓ యువతి ఫోన్‌ ఆఫరని చెప్పగానే.. ఆలోచించకుండా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.4 వేలు కట్టేశాడు. వికారాబాద్‌కు చెందిన కృష్ణ.. గచ్చిబౌలిలో దినసరి కూలీ. కొత్త మోడల్‌ ఫోన్లను వినియోగించడమంటే అతడికి మహాసరదా. ఇతడు కూడా ఈ ప్రబుద్ధుల మాటల గారడీకి పడిపోయాడు. అక్షరాల 8 వేలు సమర్పించుకున్నాడు.

ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, జవహర్‌నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, రాజేంద్రనగర్‌లలో ఎక్కువ శాతం నివసిస్తోంది ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన గ్రామీణులు. కేటుగాళ్లు వీరినే టార్గెట్‌ చేస్తున్నారు. ఖరీదైన ఫోన్‌ అనగానే ఎవరికీ చెప్పడం లేదు. చెబితే డబ్బు చెల్లించి వారే తీసుకుంటారేమోనని భయపడుతున్నారు. అమా యకుల భయం బురిడీగాళ్లకు మేలు చేస్తోంది.
ఇలాంటి మోసాల బారిన పడుతున్న వారు 80 శాతం మంది గ్రామీణులేనని పోలీసులు అంటు న్నారు. పార్శిల్‌లో తాబేలు బొమ్మ, దండలు వచ్చాయని ఫోన్‌ చేసి నెమ్మదిగా ప్రశ్నిస్తే.. ‘‘ఎక్కడో లోపం జరిగింది. మీ వివరాలు ఫలానా ఈ మెయిల్‌ నెంబర్‌కు పంపండి’’ అని చెబుతారు. అలా ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా అదే తంతు. వ్యక్తిగత వివరాలను కూడా స్వాహా చేస్తున్నారు.


ఫోన్‌ చేస్తే.. బూతు పురాణం
ఆప్యాయంగా మాట్లాడటమే కాదు.. ఎదురుతిరిగే రౌద్రాన్ని ప్రదర్శిస్తుంటారీ మాటల మాంత్రికులు. డబ్బు పోయిన బాధలో బాధితులు ఆ నెంబర్లకు ఫోన్‌ చేస్తే బూతు పురాణం మొదలుపెడతారు. ఫోన్‌ చేసిన వారిని అసభ్యకర పదజాలంతో మాట్లాడతారు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరిస్తారు. స్పష్టంగా తెలుగు మాట్లాడే ఈ ప్రబుద్ధులు ఢిల్లీ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పడం గమనార్హం.
కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఖాకీలు. గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్‌ వస్తే స్పందించొద్దని.. తక్కువ ధరకే ఫోన్‌ వస్తుందంటే నమ్మొద్దని సూచిస్తున్నారు. ఈ తరహా మోసాల బారిన పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫ్రెండ్స్ మీరూ కూడా జాగ్రత్తగా ఉండండి... షేర్ చేసి ఫ్రెండ్స్ కి తెలియజెయ్యండి.