News and Entertainment

షాకింగ్.. మంత్రి రాసలీలల వీడియో లీక్...కాసేపట్లో ప్రసారం చేయనున్న టివి చానళ్ళు


ఈ మధ్య కాలంలో కర్నాటక ప్రభుత్వంలోని మంత్రులు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రిహెచ్.వై.మేఠి రాసలీలల బాగోతం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి పలు టివి చానళ్లలో సీనియర్ మంత్రి రాసలీలల పేరిట పలు కధనాలు వెలువడ్డాయి. మంత్రి మేఠి, ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొన్న సీడీ ఉందని కాసేపట్లోనే ప్రసారం చేస్తామనే కథనాలు వచ్చాయి. ఇంతలో సీడీ వెల్లడికి సంబంధించి బళ్ళారికి చెందిన ఆర్‌టిఐ కార్యకర్తగా చెప్పుకుంటున్న రాజశేఖర్‌కు మంత్రి అనుచరులనుంచి బెదరింపులు వెల్లువెత్తాయి. ఆ బెదరింపుల ఆడియోను కూడా పలు చానెళ్ళు ప్రసారం చేశాయి. అనంతరం సీడీలు ఉన్నాయని చానెళ్ళు ప్రకటించినా వాటిని ప్రసారం చేయలేదు. ఈ విషయంపై కర్నాటక రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు హోమ్ మంత్రి పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పై ఆరోపణలు నిజమైతే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతన్ని కేబినేట్ నుంచి తొలగించే విషయం సిద్దరామయ్య వ్యక్తిగత నిర్ణయం పై ఆదారపడి ఉంటుందని చెప్పారు. మంత్రి వ్యవహారం ముఖ్యమంత్రికి పెద్ద తలనొప్పిగాపరిణమించింది.

బదిలీ కోసం వచ్చిన ఓ మహిళాఉద్యోగి పట్ల మంత్రి అనుచితంగా ప్రవర్తించారని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆర్‌టిఐ కార్యకర్త రాజశేఖర్‌ ఆరోపిస్తున్నారు. ఈమేరకు వీడియో తన వద్ద ఉందని అతను ప్రకటించుకున్నారు.



వీడియోలు ఉంటే విడుదల చేయండి... మంత్రి మేఠి

రాసలీలలకు పాల్పడినట్లు వీడియోలు ఉంటే విడుదల చేయాలని మంత్రి మేఠి ఆదివారం బాగల్కోటెలో ప్రకటించారు. రాసలీల ఆరోపణలకు తనకు సంబంధం లేదన్నారు. వీడియోలు ఉంటే విడుదల చేస్తే స్పందిస్తానన్నారు. ఆరోపిస్తున్న వ్యక్తి ఎవరో తెలియదని అంతకంటే ఆ మహిళ ఎవరో కూడా ఇప్పటివరకు చూడలేదన్నారు. బెళగావి శాసనసభ సమావేశాలలోనూ ఈ అంశం వెలుగులోకి రాలేదన్నారు. తాను ఎక్కడా తప్పించుకుపోలేదని ముందుగా నిర్ణయించుకున్న కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్ళానని అంతకుమించి ఎక్కడికీ వెళ్ళలేదన్నారు. కాగా మంత్రి మేఠి వెంటనే రాజీనామా చేయాలని మాజీ సీఎం జగదీశ శెట్టర్‌ డిమాండ్‌ చేశారు. వివరాలు వెలుగులోకి తెచ్చిన వ్యక్తికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.